APNational

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం..పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి..

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరారు.

దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి నిధులు, బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు శ్రీనివాసుడి ఫొటో, ప్రసాదాన్ని సీఎం అందించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి బకాయి ఉన్న రెండున్నర వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పు లేకున్నా రుణాలపై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు.

అలాగే పోలవరం డయాఫ్రమ్‌వాల్‌ ప్రాంతంలో చేపట్టాల్సిన మరమ్మతుల కోసం రూ. 2020 కోట్ల అవసరమని వాటిని, వెంటనే రిలీజ్‌ చేయాలని కోరారు. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ నిర్థారించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలిపాలని నిర్మలా సీతారామన్‌కు జగన్‌ విజ్ఞప్తి చేశారు.