TELANGANA

ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చేరికలకు గేట్లెత్తేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటోన్నారు.

 

ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. కొద్దిసేపటికే కొద్ది సేపటికే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంత శ్రీదేవి.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న వారిలో ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ సైతం కాంగ్రెస్‌ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూరకంగా కలుసుకున్నారు.

 

పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ ఉదయమే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు పంపించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు.

 

ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. సరైన ప్రాధాన్యత దక్కట్లేదని పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వపరంగా తనకు అవకాశాలను కల్పించింనందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా పత్రాన్ని పంపించిన కొద్దిసేపటికే ఆమె భర్తతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.