ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.2,50,000 వార్షికాదాయం దాటినవారు ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇక రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇటీవల సుప్రీం కోర్టు సమర్థించింది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ, మరోవైపు రూ.2,50,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారి నుంచి పన్నులు వసూలు చేయడం ఏంటన్న వాదనలు చాలాకాలంగా ఉన్నాయి. అందుకే ఆదాయపు పన్ను లిమిట్‌ను పెంచాలంటూ ఎప్పట్నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అయితే సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ద్రవిడ మున్నేట్ర కఝగంకు చెందిన కున్నూరు శీనివాసన్ మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌కు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత పొందుతాయని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం సంవత్సరానికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం వెనుక ఎటువంటి హేతుబద్ధత లేదని శీనివాసన్ వాదించారు. కాగ జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. ఈ తీర్పులో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కోటాను అందించడానికి ప్రభుత్వానికి అనుమతించింది.
కుటుంబానికి రూ.7,99,999 పరిమితి వరకు స్థూల ఆదాయం ఉన్నవారికి EWS కేటగిరీ కింద అర్హత లభిస్తుంది. ఈ లెక్కన రూ.8 లక్షల వరకు ఆదాయం ఉన్నవారి నుంచి ప్రభుత్వం ఆదాయపు పన్ను వసూలు చేయడాన్ని అనుమతించరాదని, వారు ఆర్థికంగా బలహీనంగా ఉండవచ్చని శీనివాసన్ వాదిస్తున్నారు. కాని ఆర్థిక చట్టం, 2022లోని మొదటి షెడ్యూల్‌లోని పార్ట్-1లోని పేరా A ద్వారా ప్రభుత్వం పన్ను స్లాబ్‌ను నిర్ణయించిందని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 21, 265ను ఉల్లంఘిస్తుందని ఆయన పిటిషన్‌లో వివరించారు. ఈ ఐదు ఆర్టికల్స్‌లో నాలుగు భారత పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. అంటే సుప్రీం కోర్టు రక్షణగా నిలిచే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం రూ.2.50 లక్షల పైన వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తుల నుంచి పన్నులు వసూలు చేస్తోందన్నది ఆయన వాదన. శీనివాసన్ పిటిషన్ స్వీకరించిన మదురై బెంచ్, ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు ఆర్ మహదేవన్, జే.సత్యనారాయణ ప్రసాద్ నేతృత్వంలోని బెంచ్ కేంద్ర చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను రెండువారాలు వాయిదా వేసింది.