ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేసింది మొదలు.. అనేక మంది బడా వ్యాపారవేత్తలు రుణాలు ఎగ్గొట్టడం, తద్వారా దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి అనేక సంస్కరణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎం చార్జీలని, యూజర్ చార్జీలు, మినిమం బ్యాలెన్స్, ట్రాన్జాక్షన్ చార్జీలు.. ఇలా ఒక్కటేమిటి.. అనేక మార్గాల్లో వినియోగదారులను బ్యాంకులు పిండేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి అసలే బాగోలేదు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆర్థిక వేత్తల మాటలు పట్టించుకోకుండా, తమ ఇష్టానుసారం చేయడం వల్ల సంస్కరణల మాట అటుంచితే ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వేగంగా కదులుతోందని ఆర్థికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా రెపోరేట్ల పెంపుతో బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి.
ఈ జాబితాలో ఇప్పటికే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ, ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను పెంచేశాయి. అయితే, ఇటీవల ఈ జాబితాలో మరో బ్యాంకు చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచి షాక్ ఇచ్చింది. నవంబర్‌లోలో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. అప్పుడు రేట్ల పెంపు 15 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఈఎంఐలు మరింత భారం.. తాజాగా రుణ రేటు పెంపు నిర్ణయం ఈనెల 12 నుంచే అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెంపుతో హౌసింగ్, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, ఎంఎస్ఈ లోన్స్ మరింత భారం అవుతున్నాయి. ఇప్పటికే రుణం తీసుకున్న వారు రీసెట్ డేట్ నుంచి అధిక వడ్డీ సమర్పించుకోవాలి. బ్యాంకులకు కట్టే ఈఎంఐ నెలవారీ మరింత భారం పడుతోంది. సామాన్యుడు మరింత ఇబ్బంది పడేలా ఈ నిర్ణయం ఉంది.