ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు.
సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు వేస్తున్నారు.
‘మీ బిడ్డ ఒక్కడిగా వస్తాడు.. మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్ళ గుంపు సిద్ధంగా వుంది..’ అంటూ తాజాగా పాత పాటే పాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ఓ అధికారిక బహిరంగ సభలో. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించే క్రమంలో షరామామూలుగానే వైఎస్ జగన్ రాజకీయ విమర్శలు చేసేశారు.
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి, అధికారిక బహిరంగ సభలు నిర్వహించేది రాజకీయ విమర్శల కోసమా.? అలాగైతే, ప్రజాధనం దుర్వినియోగమవుతున్నట్లే కదా.? ‘మీ బిడ్డని’ అని చెబుతున్న వైఎస్ జగన్, ఆ ప్రజలకు చెందాల్సిన ధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడమేంటి.? డొల్లతనం అనేది ఇక్కడే అర్థమయిపోతోంది కదా.!
పార్టీ తరఫున బహిరంగ సభలు నిర్వహించుకుని, వాటి వేదికగా వైఎస్ జగన్, రాజకీయ విమర్శలు చేస్తే అది పద్ధతిగా వుంటుందేమో.! సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. అసలంటూ, విపక్షాలు పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకున్నా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు కదా.. ‘వై నాట్ 175’ అనే మాట వైఎస్ జగన్ గుంె లోతుల్లోంచి వచ్చిందే అయితే.!
85 శాతం కుటుంబాలు తమ ప్రభుత్వం కారణంగా సాయం పొందుతున్నాయన్నది వైఎస్ జగన్ ఉవాచ. ‘మనం మేలు చేస్తున్నాం, మనకెందుకు జనం ఓట్లెయ్యరు..’ అని పదే పదే వైఎస్ జగన్ తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. అంతలోనే, ‘నేను ఒంటరివాడ్ని..’ అని పదే పదే వాపోతున్నారు వైఎస్ జగన్.
అంటే, ఎక్కడో తేడా కొడుతోంది.. దారుణమైన పరాజయాన్ని చవిచూడబోతున్నానని. ‘కలిసొస్తారో, విడిగా వస్తారో బస్తీ మే సవాల్..’ అనాల్సింది పోయి, ‘వాళ్ళంతా తోడేళ్ళలా కలిసి వస్తున్నారు’ అంటారేంటి.? ముఖ్యమంత్రిలో పెరిగిన అభద్రతాభావానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?