NationalPOLITICS

పొత్తులపై పవన్ కళ్యాణ్ సూచనలపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు.

నేడు గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసిపి అవినీతిపై మండిపడ్డారు.

వైసిపి అవినీతిపై చార్జిషీట్, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అజెండాగా నేడు సమావేశం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక పొత్తు అంశం తాము చర్చించలేదని మరో క్లారిటీ ఇచ్చారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు ఎలా వెళ్లాలి అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది అని, పవన్ కళ్యాణ్ చేసిన సూచనలపై జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని, అవినీతి, అరాచకాలతో రాష్ట్ర ప్రభుత్వం మునిగి తేలుతుందని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వైసీపీ పాలన పై బీజేపీ రాజకీయ యుద్ధం చేయడానికి రెడీ అవుతోందని, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరును చార్జిషీటు గా రూపొందిస్తున్నామని జివీఎల్ పేర్కొన్నారు. 145 నియోజకవర్గాల్లో తాము ఛార్జిషీటు రూపొందించామని పేర్కొన్న ఆయన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపైన, నాయకులపైన ప్రజాభిప్రాయ సేకరణ చేశామని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, రాష్ట్రప్రభుత్వ దోపిడిని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని జీవీఎల్ వెల్లడించారు. బిజెపి నేతల పై పోలీసుల దాష్టీకం అమిత్ షా కు వివరిస్తామని, నెల్లూరు జిల్లాలో డిఎస్పి తీరు దారుణం అంటూ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. మోడీ తొమ్మిదేళ్ల ప్రగతి పాలన ప్రజలకు వివరిస్తూ నెల రోజుల పాటు కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు బీజేపీఎంపీ జీవీఎల్ నరసింహారావు.