రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెండు వేల నోట్లను ఉప సంహరించుకుంది. ఇప్పటికే వీటి ముద్రణ నిలిపివేయటంతో సామాన్యుల పైన అంతగా ప్రభావం ఉండే అవకాశం లేదు.
ఇప్పటి వరకు సర్క్యులేషన్ లో ఉన్న రెండు వేల నోట్లు 2017 ముందు జారీ చేసినవి. వీటిని మార్చుకోవటానికి…డిపాజిట్ కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉంది. పెద్ద నోట్లు రద్దు అనే లక్ష్యంలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో రూ 500 నోట్లు కూడా రద్దు చేస్తారా అనే చర్చ మొదలైంది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నాటి నిర్ణయంతో : 2016లో నాడు ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆ తరువాత రెండు వేట నోటు తీసుకొచ్చారు. వెయ్యి నోటు రద్దు చేసి రెండు వేల నోటు తీసుకురావటం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పెద్ద నోట్ల కారణంగా బ్లాక్ మనీ పెరుగుతోందని..నివారించే క్రమంలో తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లో భాగంగా అంతకంటే పెద్ద నోటు ఎలా తీసుకొస్తారనే ప్రశ్నలు మొదలయ్యాయి. పెద్ద నోట్లు రద్దు లక్ష్యం ఎంత వరకు నెరవేరిందనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. కానీ, పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరాల్సి వచ్చింది. కానీ, ఇదే సమయంలో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి.
రెండు వేల నోట్ల రద్దుతో : 2018 నుంచి రెండు వేల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. బ్యాంకుల్లో, ఏటీఎంల్లో రూ 500 నోట్లు పెద్ద నోటుగా చెలామణిలో ఉంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ తొలి రెండు వేల నోట్లను ఉప సంహరించుకుంటూ నిర్ణయం ప్రకటించింది. ఇందులో కేంద్రం జోక్యం లేదనే విధంగా ప్రకటన జారీ అయింది. ఇప్పుడు తరువాతి నిర్ణయం రూ 500 మీద ఉంటుందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రూ 500 నోటుతోనే పెద్ద సంఖ్యలో లావా దేవీలు కొనసాగుతున్నాయి. రెండు వందల నోట్లు, వంద నోట్లు ఉన్నా.. ఇప్పుడు 500 నోట్ల రద్దు చేయటం అంత సులువైన నిర్ణయం కాదనేది ఆర్దిక వేత్తల అంచనా. గతంలో ఉన్న అనుభవాలతో కేంద్రం నేరుగా నోట్ల రద్దు ఆలోచన చేయదని అంచనా వేస్తున్నారు.
500 నోట్లపై ఏం జరుగుతోంది : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న నగదులో రూ 500 నోట్ల వాటా 72 శాతంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో చెలామణిలో మాత్రం 37 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరాలంటే పెద్ద నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు లాంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఈ క్రమంలో కేంద్రం 500 నోట్ల రద్దు వంటి నిర్ణయాల దిశగా అడుగులు వేయదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో డిజిటల్ పేమెంట్స్ మరింత పెంచేలా నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.