NationalTechnology

ఆ వీడియోలు పోస్ట్ చేస్తే 90 రోజుల సస్పెన్షన్.. ‘ఎక్స్’ కొత్త నిబంధన..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) తమ కంటెంట్ క్రియేటర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అలాంటి క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.

 

ఈ కొత్త నిబంధనలను ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. యుద్ధ సమయాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టి, ప్లాట్‌ఫామ్‌పై వాస్తవికతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “ప్రస్తుత ఏఐ టెక్నాలజీతో ప్రజలను సులభంగా తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను సృష్టించవచ్చు. అందుకే ఈ మార్పులు చేస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. మొదటిసారి సస్పెన్షన్ తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే, రెవెన్యూ ప్రోగ్రామ్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు.

 

కమ్యూనిటీ నోట్స్ లేదా ఏఐ టూల్స్ మెటాడేటా ద్వారా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తామని నికితా వివరించారు. ఇప్పటికే ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను గుర్తించేందుకు ‘మేడ్ విత్ ఏఐ’ అనే లేబుల్‌ను ఎక్స్ పరిచయం చేసింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్య నేపథ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై ట్రాఫిక్ ఆల్-టైమ్ రికార్డుకు చేరుకుందని ఇటీవల మస్క్, నికితా ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉంటే… ఎలాన్ మస్క్ సంపద చరిత్రలోనే తొలిసారిగా 800 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ, ఏఐ స్టార్టప్ xAIని కొనుగోలు చేయడంతో మస్క్ ఆస్తుల విలువ సుమారు 852 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.