మోటార్ స్పోర్ట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన.. ఫార్ములా – ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కి హైదరాబాద్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గత నవంబర్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరిగింది. ఇందుకోసం నగర నడిబొడ్డున ట్యాంక్ బండ్ వేదికగా ఎన్టీఆర్ పార్క్ చుట్టూ 2.8 కిలోమీటర్ల స్పెషల్ రేసింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేసారు. ఇక ఆ రేస్ లో కేవలం F-3 & 4 రేస్సర్స్ పాల్గొన్నారు. అయితే ఈ రేసింగ్ ఫిబ్రవరి 11 న జరగనున్న ఫార్ములా – ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు ట్రయల్స్ ఉపయోగపడ్డాయి. ఇండియాలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా – ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ వచ్చే నెల జరగనుంది. ఇక ఈ రేస్ లో ఇంటర్నేషనల్ ఫార్ములా రేస్ డ్రైవర్స్ పాల్గొననున్నారు. గతంలో జరిగిన సర్క్యూట్ రేసింగ్ ట్రాక్ పైనే ఈ రేస్ కూడా జరగనుంది. ఎన్టీఆర్ పార్క్ చుట్టూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటో మొబైలియో నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా నిర్మించిన 2.8 కిలోమీటర్ల ట్రాక్ పై జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా 16 రౌండ్స్ గా 14 దేశాల్లో వరల్డ్ ఛాంపియన్ షిప్ రేసింగ్ లీగ్ జరుగుతుండగా అందులో ఇండియా నుంచి హైదరాబాద్ వేదిక అయ్యింది. జనవరి 14న మెక్సికో సిటీలో తొలి రౌండ్ రేస్ తో ఛాంపియన్ షిప్ మొదలు కానుండగా.. జనవరి 27, 28 న Dariyah సిటీలో సెకండ్, థర్డ్ రౌండ్ రేసింగ్ జరగనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఫోర్త్ రౌండ్ రేస్ జరగనుండగా జులై 30న లండన్ లో చివరి రౌండ్ రేస్ తో ఛాంపియన్ షిప్ ముగియనుంది. ఈ రేసింగ్ ఇప్పటి వరకు టీవీల్లో మాత్రమే చూసేవారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కింది. బుక్ మై షో ద్వారా టికెట్స్ విక్రయించనున్నారు. కేటగిరీల వారీగా 1000, 3500, 6000, 10000 రూపాయలుగా టిక్కెట్ ధరలను నిర్ణయించారు. మొత్తం 22 వేల 500 టికెట్లు అందుబాటులో ఉంచారు. కాగా ఫార్ములా-ఈ రేసు మొదటి టిక్కెట్‌ను తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఐఏఎస్ కొనుగోలు చేశారు. కాగా ఫార్మూలా ఈ రేసింగ్ ఆతిథ్యంతో హైదరాబాద్ మరోసారి వరల్డ్ స్పోర్టింగ్ సిటీస్‌లో చోటు దక్కించుకుందన్నారు అర్వింద్ కుమార్. ఫార్ములా – ఈ రేసింగ్ లో 11 టీమ్స్.. 22 రేసింగ్ డ్రైవర్స్ పాల్గొననున్నారు. వీరంతా కూడా గతంలో ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నవారే. ఎన్విరాన్మెంట్ ఎనర్జీ అండ్ ఎంటర్టైన్మెంట్ నినాదంతో వరల్డ్ ఛాంపియన్ షిప్లో ఎలక్ట్రిక్ రేస్ కార్స్‌తో రేసర్స్ దూసుకుపోనున్నారు. కాగా ఈ-రేసింగ్‌ను ఎక్కువ మంది వీక్షించేందుకు పలు ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.