హైదరాబాద్: తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. పాకిస్థాన్ నుంచి ఈ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ట్విట్టర్ వేదికగా రాజా సింగ్ ఈ మేరకు వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమస్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతి రోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి’ అని రాజా సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజా సింగ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. గతంలో కూడా రాజా సింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనిచేయడం లేదని.. మార్గమధ్యలోనే ఆగిపోతోందని రాజా సింగ్ ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాడైపోయిన ఆ వాహనాన్నే రిపేర్ చేయించి తిరిగి పంపిస్తున్నారని తెలిపారు.