వరంగల్ మెడికో విద్యార్థిని ప్రీతికి సైఫే హానికరమైన ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆమె తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు చావుకు కారణమైన అతడిని కఠినంగా శిక్షించాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు.
తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని..దేనినైన ఎదురిస్తుందని అన్నారు. ప్రీతి నాకు ఫోన్ చేసి నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారనే భయం వుందని చెప్పింది. అలా చెప్పిన కొద్దిసేపటికే ఇలా జరిగిందని అన్నారు. దీనికి కారణం అయిన సైఫ్ ను ఉరి తీయాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు. ప్రీతిని సైఫ్ కావాలనే హత్య చేశాడు..దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు పంపానని అన్నారు.
ఇదిలా ఉంటే..వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో అనస్థీషియా విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది ప్రీతి. గతేడాది నవంబర్ నుంచి కాలేజీలో చదువుతున్న ఓ సీనియర్ విద్యార్ధి వేధిస్తూ ఉండటంతో ఆమె మంగళవారం నైట్ డ్యూటీలో ఉండగా హానికరమైన ఇంజెక్షన్ వేసుకుంది. డ్యూటీ ముగిసిన తర్వాత బుధవారం ఉదయం 6.30గంటలకు మెడికో అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి సీపీఆర్ (CPR)చేసారు. పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో వెంటనే హైదరాబాద్(Hyderabad) నిమ్స్(Nims)లో చేర్పించారు. గత 5 రోజులుగా ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ క్రమంలో ఆమె మృతిపై తండ్రి సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ప్రీతి మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. మొదట రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అయితే నిమ్స్ వద్ద ప్రీతి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. దీనితో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి కీలక హామీలిచ్చారు. రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. అలాగే ప్రీతి మృతిపై ఫాస్ట్రాక్ కోర్టుతో విచారణ జరిపిస్తామని మంత్రులు హామీనిచ్చారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే ప్రీతి మృతిపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కాసేపట్లో అంత్యక్రియలు..
కాగా నేడు మొండ్రాయిలోని గిర్నీ తండాలో ప్రీతి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ప్రీతి అంత్యక్రియల్లో అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రీతి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.