NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన హైదరాబాద్‌ వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. పిళ్లైకి సంబంధించిన ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. రామచంద్ర పిళ్లై సౌత్‌గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత బినామీగా ఉన్నారని , ఆమె ప్రయోజనాల కోసం రామచంద్రి పిళ్లై పనిచేశారని రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైకి సంబంధించి 17 పేజీలతో రిమాండ్‌ రిపోర్ట్‌ను తయారు చేసింది ఈడీ.. తాను కవిత బినామీ అని విచారణలో రామచంద్రపిళ్లై అంగీకరించారని కూడా పేర్కొన్నారు. లిక్కర్‌ స్కాంలో సౌత్‌ గ్రూప్‌కు పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి , నగదు బదిలీకి సంబంధించి ఆయన్ను లోతుగా విచారించాల్పిన అవసరం ఉందని ఈడీ వాదించడంతో ఈనెల 13వ తేదీ వరకు కస్టడీకి అప్పగించారు.

సౌత్‌ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌రెడ్డితోపాటు వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ ఉన్నారని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ ప్రతినిధులుగా అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌, బుచ్చిబాబు ఉన్నారని , కవితకు లబ్ధి కోసం ఆరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఆప్‌ నేతలకు , సౌత్‌ గ్రూప్‌ సభ్యలుకు మధ్య పిళ్లై మధ్యవర్తిగా పనిచేశారని కూడా ఈడీ పేర్కొంది. ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు పిళ్లై దర్యాప్తులో అంగీకరించారని , సౌత్‌గ్రూప్‌ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.292 కోట్లు సంపాదించిందని కూడా ఈడీ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాన్ని పేర్కొంది.

తాను కవిత బినామీ అని అరుణ్‌ విచారణలో పలు మార్లు చెప్పారని , ఇదే విషయాన్ని మరి కొందరు నిందితులు కూడా చెప్పారని ఈడీ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో రామచంద్ర పిళ్లై కీలకపాత్ర పోషించాడని , 12శాతం లాభం చేకూర్చడంలోనూ ఆయన పాత్ర ఉందని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ వ్యక్తుల సంస్థలన్నీ కలిసి రూ.3,500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ తెలిపింది. 12శాతం లాభంగా రూ.420కోట్లు వస్తే అంతా పంచుకున్నారని పేర్కొంది.

లిక్కర్‌స్కామ్‌లో సోమవారం రామచంద్ర పిళ్లైని ఈడీ అదుపు లోకి తీసుకుంది. రామచంద్ర పిళ్లై విచారణను వీడియో రికార్డింగ్‌ చేయాలని , ప్రతిరోజు 2 గంటల పాటు కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రామచంద్ర పిళ్లై రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. తన తల్లితో ఫోన్లో మాట్లాడేందుకు కూడా పిళ్ళైకి అవకాశం కల్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.