NationalTELANGANA

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు..

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్‌కతాలో జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. ఇప్పటివరకు 25 నగరాల్లో 36 సదస్సుల నిర్వహించగా ఈ ఏడాది జీ-20 సదస్సుకు ఇండియా నేతృత్వం వహిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాధల అంశంపై ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డిజిటల్ ఎకానమీ రంగంలో ఇండియా సాధించిన విజయాలపై సదస్సులో ప్రస్తావించనున్నారు ఇండియా ప్రతినిధులు. అలాగే 2030 నాటికి ఇండియా లక్ష్యాలను ఇతర దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌ (జీపీఎఫ్‌ఐ) పేరుతో జరుగుతోన్న ఈ సదస్సులో జీ 20 దేశాల ప్రతినిధులతోపాటు ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.

 

ఇక మార్చినెల 6, 7 తేదీల్లో జీ 20 సమావేశాలు హైదరాబాద్‌ వేదికగా జరగనున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జీ 20 ఇండియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ హర్షవర్ధన్‌ ష్రింగ్లా మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు.

 

ఈ సమావేశాలకు ముందు మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు గ్లోబల్‌ సౌత్‌ ఎమర్జింగ్‌ ఎకానమీ కోసం నాలెడ్జ్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు ప్రణాళిక, జీ 20 యేతర దేశాల భాగస్వామ్యం, జీ 20తోపాటు ఇతర దేశాల్లో డిజిటల్‌ చెల్లింపులు తదితర అంశాల గురించి చర్చించనున్నట్టు వివరించారు. హైదరాబాద్‌లో జరిగే జీ 20 సమావేశాలకు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.