పోసాని కృష్ణమురళి అంటే తెలియను తెలుగు ప్రేక్షకులు లేరు. ఐలవ్యూ రాజా అంటూ ఆయన పలికే డైలాగ్ ఇప్పటికీ పాపులరే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో సీరియస్, నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన తర్వాతి కాలంలో కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆపరేషన్ దుర్యోధన సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై పోసాని కృష్ణ మురళి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ హాట్ టిపిగ్ గా మారాయి.
కన్ఫ్యూజన్ ఉంది: నటుడు, దర్శకుడు, రచయిత అయిన పోసాని కృష్ణ మురళి ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిలీం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నంది అవార్డుల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. నంది అవార్డులు ఇవ్వడంపై కన్ఫ్యూజన్ ఉందంటూ పలు వ్యాఖ్యలు చేశారు.
నంది ఇవ్వకుంటే అలుగుతా : “నంది అవార్డుల గురించి మీరంతా అడుగుతున్నారు. నేను తెలుగు సినీ పరిశ్రమలో బాయ్ గా ఉన్నప్పటి నుంచీ చూస్తున్నా. అది మీకు తెలుసు. మీడియా ద్వారానే నేను చాలా తెలుసుకున్నా. నంది అవార్డులు ప్రకటించడానికి ముందే ఫలానా కాంపౌండ్ కు రెండు కావాలి.. ఈ కాంపౌండ్ కి రెండు పోవాలి. ఇంకోదానికి మూడు వెళ్లాలి. ఆ డైరెక్టర్ కు రెండు ఇస్తే నాకు మూడు ఇవ్వాలి. మూడు ఇవ్వకపోతే నేను అలుగుతా. నంది అవార్డులకు నేను వెళ్లను వంటివి మనం చూశాం” అని పోసాని కృష్ణ మురళి అన్నారు.
నేను అడగలేదు.. అలగలేదు : “నంది అవార్డుల కోసం నేనే రెండు సార్లు ఫైట్ చేశాను. పేర్లతో సహా మీడియా ద్వారానే మొత్తం ఇండస్ట్రీకి తెలియజెప్పా. దానికి పర్యవసానం ఏమైంది.. పోసాని కృష్ణ మురళి అనేవాడికి నంది అవార్డు ఇవ్వకూడదు అని నిర్ణయించారు. నేను చేసిన సినిమాలు చూడండి. గాయం, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, ప్రేయసి రావే, ఆపరేషన్ ధుర్యోదన వీటిల్లో దేనికైనా నాకు నంది అవార్డు ఇచ్చారా. ఎందుకంటే నేను అలగలేదు. అడగలేదు. నంది నా కాంపౌండ్ లోకి రాలేదు” అని పోసాని కృష్ణ మురళి ఆవేదన వ్యక్తం చేశారు.
కళ్లకు కమ్మ అవార్డుగా : “నేను రైటర్ గా ఉన్నప్పుడే పేర్లు పెట్టి మరీ నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగా. దానికి నన్ను తిట్టడం తప్పితే వాళ్లలో రియలైజేషన్ లేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాలో చేశా. నా ఖర్మకాలి నాకు నంది అవార్డ్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఇవ్వడానికి ఇక ఎవ్వరు లేరు. ఆప్షన్ లేక నాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే కాంపౌండ్ లోకి వెళ్లాల్సిన నందులు వెళ్లిపోయాయి. నాకు వచ్చింది కమ్మ అవార్డుగా భావించా. నా కళ్లకు అది కమ్మ నందిలా కనిపడింది. అందుకే ప్రెస్ మీట్ లో ఈ నంది అవార్డ్ నాకు వద్దు అని చెప్పా” అని పోసాని చెప్పుకొచ్చారు.
పాపపు చేతులతో: “మా ప్రభుత్వం నంది అవార్డులు ఎలా ఇవ్వాలనే విషయంలో తర్జనభర్జన పడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందుల్ని పంచుకోమని ఆయన చెప్పకపోవచ్చు. కానీ కిందవాళ్లు పంచేసుకున్నారు. వాళ్ల చేతుల్లో ఉంటే నందులు వెళ్లిపోతాయి. ఇప్పుడు వాటిని కెలికి మా పాపపు చేతులతో నందులు ఇవ్వాలంటే కష్టంగా ఉంది మాకు. ఎప్పుడో ప్రకటించిన అవార్డులు ఎందుకివ్వలేదు అంటే సమాధానం లేదు” అని పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు.
చండాలం మాత్రం చేయను: “నంది అవార్డులు ప్రతి ఏడాది వివాదం ఎందుకు అవుతుంది అంటే సమాధానం లేదు. అడిగేవాడు లేడు. చెప్పేవాడు లేడు. చెబితే నా మాదిరిగా వచ్చిన నంది కూడా వెళ్లిపోతుంది. కాబట్టి ఇవన్నీ సీఎంతో సి. కల్యాణ్ తో కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆ పాతవి ఇవ్వాలా వద్దా. వాటిని పక్కన పెట్టి కొత్తవి ఇవ్వాలా అనే విషయంలో గందరగోళ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కాస్తా సమయం ఇవ్వండి. నేను మంచి చేస్తానో లేదే తెలియదు కానీ, చండాలం మాత్రం చేయను” అని పోసాని తెలిపారు.