వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడటం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన దెబ్బకు కేంద్రమే దిగొచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
శాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేస్తాం అని కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటించారు. అక్కడి పార్టీలు నోరు మూసుకున్నప్పటికీ.., ప్రజలు, కార్మికులు పక్షాన నిలబడటం కోసం బిఆర్ఎస్ పోరాటం చేసింది. అధికార పక్షం నోరు మూసుకున్నా, ప్రతి పక్షం ప్రశ్నించకపోయినా.. ప్రజల కోసం బిఆర్ఎస్ పోరాటం చేసింది. అందుకే కేంద్రం దిగి రాకతప్పలేదన్న మంత్రి హరీశ్ రావు.. అయినప్పటికీ మా జాగ్రత్తలో మేముండి కేంద్రం పై పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం అని స్పష్టంచేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం దిగి రావడం అనేది తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించిన విజయం, ఇది బిఆర్ఎస్ పార్టీ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు, కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం అని అన్నారు. అన్యాయం ఎక్కడ జరిగినా.. అక్కడ అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ జెండా పోరాటం చేస్తుంది. అండగా ఉంటుంది అని మంత్పి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
ఇది తనకు ఆత్మీయ సమ్మేళనం తరహాలో లేదు, విజయోత్సవ సభ లాగా ఉంది. పక్కనే చించోలి ఉంది. అక్కడ నీళ్ళు వస్తున్నాయా. సీఎం కేసీఆర్ పట్టు బట్టి కొట్లాడి మరీ తెలంగాణ తీసుకొచ్చారు. ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్, టిడిపి పాలకులు ఇన్నేళ్లపాటు చేయంది సీఎం కేసీఆర్ చేశారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు. సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. కేసీఆర్ ఒక పెద్ద కొడుకు లాగా ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. కంటి వెలుగుతో ఇంటింటికి దవాఖాన తెచ్చి, కంటి పరీక్షలు చేయించారు. మేన మామ లాగా ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చాడు. ప్రతి రైతుకూ రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాడు. నాడు ఎరువుల కోసం పోలీసు స్టేషన్ ముందు లైన్లో నిలబడాల్సి ఉండేది… 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడైనా ఎరువుల కోసమో లేక విద్యుత్ కోసమో… నీళ్ల కోసమో ఇబ్బంది అయ్యిందా అని ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు.