TELANGANA

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున కూడా ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, సీఎం అయ్యేది మాత్రం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలతో మండిపడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి తాము డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

ప్రతీ రూపాయి కాంగ్రెస్ దే..
మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చిందేనని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని పేర్కొన్నారు. తాము కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు.

ప్రమాణం చెద్దామని సవాల్..
తనపై, కాంగ్రెస్ పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల పై.. బీజేపీ నేతలు విశ్వసించే భాగ్యలక్ష్మి ఆలయం లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు తాను వచ్చి ప్రమాణం చేస్తానన్నారు. ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు, ఈటల రాజేందర్ వస్తారా? అంటూ సవాల్ విసిరారు.