TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.

రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ఈ పతకాలను అందించనున్నట్లు తెలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. 2022 సంవత్సరానికి గాను 30 మంది పోలీస్‌ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పతకం, 28 మందికి ఉత్కృష్ట సేవా పతకం, అసాధారణ ఆసూచన కుశలత పతకం ఏడుగురికి, ఇన్వెస్టిగేషన్‌లో ప్రతిభ చూపిన ఎనిమిది మందికి హోంమినిస్టర్‌ మెడల్స్‌, ట్రైనింగ్‌ సమయంలో ప్రతిభ చూపించిన 11 మందికి హోంమంత్రి మెడల్స్‌, శౌర్య పతకం 11 మంది, మహోన్నత సేవ పతకానికి ఏడుగురు పోలీస్‌ అధికారులు ఎన్నికయ్యారు.