NationalTELANGANA

నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను గుర్తుంచుకోవాలన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.

ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, సీహెచ్.విఠల్, పోరెడ్డి కిశోర్ రెడ్డి, రిటైర్ట్ ఐపీఎస్ అధికారి క్రిష్ణ ప్రసాద్ లతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.

బండి సంజయ్ ప్రెస్ మీట్‌లోని ముఖ్యాంశాలు…
హైదరాబాద్ లో హిజ్జు ఉత్ తహరీర్ (HUT) సంస్థ ఉగ్రవాదులు దొరికారు. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరంగా మారింది. రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్న సంస్థ. ఒంటరిగానే ఎవరిపైనైనా దాడులు చేసి కలకలం సృష్టిస్తున్న సంస్థ ఇది. ఇట్లాంటి ప్రమాదకరమైన సంస్థకు హైదరాబాద్ షెల్టర్ జోన్ గా మారడం ఆందోళన కలిగిస్తోంది. మేం అనేక సందర్భాల్లో పాతబస్తీలో రోహింగ్యాలకు షెల్టర్ జోన్ గా మారిందని చెబుతూనే ఉన్నాం. ఇవాళ అదే నిజమైంది. పట్టుబడ్డ హెచ్ యూటీ ఉగ్రవాది మహ్మద్ సలీం డెక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్ ఓడీగా పనిచేస్తున్నాడు. ఈ కాలేజీ అధినేత ఒవైసీనే. మజ్లిస్ కు ఉగ్రవాదులతో సంబంధం ఉందనడానికి ఇంతకంటే ఆధారాలేం కావాలి అని బండి సంజయ్ ప్రశ్నించారు.

2016 జులైలో ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సమయంలో ఒవైసీ మాట్లాడుతూ వాళ్లకు బెయిల్ ఇప్పిస్తా… వాళ్ళ తరపున న్యాయపోరాటం చేస్తానని అధికారికంగా ప్రకటించారు. అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇదిగో ఆ పత్రిక క్లిప్పింగ్… ఆరోజు బెయిల్ ఇప్పిస్తానన్న వ్యక్తే ఇయాళ తన మెడికల్ కాలేజీలో ఉద్యోగమిచ్చి పెంచి పోషిస్తున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నేను రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటే చాలామంది మొరిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఓట్లు పొందడానికి జిమ్మిక్కు చేస్తున్నారే తప్ప అలాంటిదేమీ లేదని ట్విట్టర్ టిల్లు, ఒవైసీ సోదరులు ఆనాడు మాట్లాడారు. ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తాన్న ఒవైసీ ఎట్లాంటి వాడో ఆలోచించాలి.