APTELANGANA

టీడీపీతో పొత్తు తేలేది అక్కడే- సోము వీర్రాజు క్లారిటీ..

పీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా కలుపుకోవాలంటూ తమ భాగస్వామిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీని కోరుతున్నారు.

దీంతో టీడీపీని కలుపుకోవాలా వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ప్రతిపాదనలు పంపి వదిలేసింది. ఇప్పటికే పవన్ తో టచ్ లో ఉన్న అధిష్టానం పెద్దలు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో టీడీపీతో బీజేపీ పొత్తుకు సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ స్పందించారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గరి నుంచి ప్రతిపాదన వచ్చినట్లు సోము తెలిపారు. దీన్ని బీజేపీ అధిష్టానానికి పంపినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. దీంతో బీజేపీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.

మరోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ కలిసి రాకపోతే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారన్న సంకేతాల నేపథ్యంలో సోము వీర్రాజుతో పాటు కాషాయ నేతల స్పందన కీలకంగా మారింది. నిన్న కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా దాదాపు ఇదే సంకేతం ఇచ్చారు. టీడీపీతో పొత్తుపై కేంద్రంలో పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

దీంతో ఇప్పుడు పవన్ కోరికను బీజేపీ అధిష్టానం మన్నించి గతంలో తమకు శత్రువుగా మారి తాజాగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబును తిరిగి ఆదరిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఒకవేళ టీడీపీని కూడా కలుపుకునిపోయేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే అది కచ్చితంగా రాష్ట్రంలో రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. దీంతో ఏపీలో అధికార వైసీపీ సైతం ఈ పొత్తు రాజకీయాల్ని నిశితంగా గమనిస్తోంది.