హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు.
ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎంకు వివరించారు.
దేశం గర్వించేలా నిర్మించుకున్న డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణకు అనువుగా గొప్పగా నిర్మాణమయ్యిందని, అధికారులు సిబ్బంది ఆహ్లాదకరవాతావరణంలో పనిచేస్తున్నారని సీఎం హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభించుకుని నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతులు పూర్తవ్వడం గురించి, సౌకర్యాలు అందుబాటులోకి రావడం గురించి సీఎస్ శాంతకుమారిని సంబంధిత ఉన్నతాధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
అన్ని శాఖల హెచ్ఓడీలు ఒకే చోట: సమీకృత హెచ్ఓడీలకు ట్విన్ టవర్లు: సీఎం కేసీఆర్
సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాలను ఒకే చోటకు చేర్చడం గురించి సీఎం చర్చించారు. హెచ్ఓడీ అధికారులకు సెక్రటేరియట్ తో తరచుగా పని వుంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను కూడా సెక్రటేరియట్ దగ్గర్లో సమీకృతంగా ఒకే చోట నిర్మించేందుకు సీఎం నిర్ణయించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్ఓడీలు వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్ కు అందుబాటులో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో సీఎం అడిగి తెలుసుకున్నారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరంమేరకు, హెచ్ఓడీలన్నీ ఒకే చోట వుండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు.