హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిపదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మే నెలలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలమ్‌లతో సరళమైన అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే లబ్దిదారులకు రూ. లక్ష పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త పథకం అమల్లోకి తీసుకురావడం పట్ల ఆయా కులవృత్తులవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే ఈ మొత్తం తమకు ఎంతగానో ఉపయోగడపుతుందని వారు చెబుతున్నారు.