TELANGANA

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: 26 నుంచి రైతుబంధు నిధులు జమ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. జూన్ 26 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ నిర్ణయించింది.

వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. కాగా, వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.

 

ఈ రైతు బంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు.

రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది.