TELANGANA

చెరకు పంట ఎఫ్ఆర్పీ పెంపునకు కేంద్ర కేబినెట్ నిర్ణయం

చెరకు పంట న్యాయమైన గిట్టుబాటు ధర (fair and remunerative price FRP) ని క్వింటాల్ కు రూ. 10 పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది.

తాజా పెంపుతో చెరకు పంట ఎఫ్ఆర్పీ క్వింటాల్ కు రూ. 315 కు చేరింది. ఈ ధర ఈ అక్టోబర్ నెల నుంచి ప్రారంభమయ్యే 2023-24 మార్కెటింగ్ సీజన్ నుంచి అమల్లోకి వస్తుంది.

2023-24 మార్కెటింగ్ సీజన్ నుంచి..

కేబినెట్ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. అన్నదాతకు మోదీ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 2014-15 మార్కెటింగ్ సీజన్ లో చెరకు పంట ఎఫ్ఆర్పీ క్వింటాల్ కు రూ. 210 గా ఉండేదని, ఇప్పుడు ఆ ధర రూ. 315 కి పెరిగిందని అనురాగ్ ఠాకూర్ వివరించారు. 9 సంవత్సరాలలో క్వింటాల్ కు రూ. 100 కు పైగా చెరకు ఎఫ్ఆర్పీ పెరిగిందన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ ఈ మేలో సమావేశమై, బేసిక్ రికవరీ పై కనీసం 10.25% ఎఫ్ఆర్పీ ఉండాలని సిఫారసు చేసింది. చెరకు గడల నుంచి ఉత్పత్తి అయ్యే పంచదార క్వాంటిటీని రికవరీ రేట్ గా పరిగణిస్తారు. రికవరీ రేట్ 9.5% కన్నా తక్కువ ఉన్న చెరకు పంటకు 2023-24 మార్కెటింగ్ సీజన్ నుంచి క్వింటాల్ కు రూ. 291.975 ఇవ్వాలని నిర్ణయించారు. ఇది 2022-23 మార్కెటింగ్ సీజన్ లో రూ. 282.125 గా ఉంది.

5 కోట్ల మంది రైతులు..

దేశవ్యాప్తంగా చెరకు పంటను పండించే రైతులు సుమారు 5 కోట్ల మంది ఉంటారు. అలాగే, షుగర్ మిల్స్ లో కనీసం 5 లక్షలమంది కార్మికులు పని చేస్తుంటారు. వీరు కాకుడా, చెరకు పంటకు సంబంధించి, కూలీలు, రవాణా కార్మికుల వంటి అదనపు పనులు చేసే కార్మికులు లక్షల్లో ఉంటారు. వీరందరిపై చెరకు ఎఫ్ఆర్పీ ప్రత్యక్ష, లేదా పరోక్ష ప్రభావం చూపుతుంది. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో రూ. 1.11 లక్షల కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును షుగర్ మిల్స్ రైతుల నుంచి కొనుగోలు చేశాయి.