నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు తడిసిముద్దయ్యారు.
రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
శుక్రవారం రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలిలో 1.4 సెం.మీలు, పటాన్‌చెరులో 1.3 సెం.మీలు, పాశమైలారంలో 1.2 సెం.మీలు, బీహెచ్‌ఈఎల్‌లో 1.2 సెం.మీలు, హఫీజ్‌పేట, మియాపూర్, ఆర్‌సీ పురంలో 1.1 సెం.మీలు, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, బోరబండ తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. కాగా, తెలంగాణ రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది.