NationalTELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా అన్ని వర్గాలను ఆకట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాల ప్రకటను సిద్దమయ్యారు.

ఈ రోజు అసెంబ్లీలో ఉద్యోగుల పీఆర్సీ తో పాటుగా మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటుగా మరిన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు.

నేటితో సమావేశాల ముగింపు: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఎన్నికల ముందు దాదాపు ఇవే చివరి సమావేశాలుగా భావిస్తున్నారు. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తే మినహా.. సభా సమావేశం అయ్యే అవకాశం లేదు.

ఈ సమయంలో ఈ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నుంచి ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా సాధించిన విజయాలతో పాటుగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా పీఆర్సీపై ప్రకటన చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ విషయంలో కూడా ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు.

పీఆర్సీ – ఐఆర్ ప్రకటిస్తారా: పీఆర్సీ ఏర్పాటు ప్రకటనతోపాటు మధ్యంతర భృతి (ఐఆర్‌)ని కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏర్పాటైన మొదటి పీఆర్సీ కాలం ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. దీంతో జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితమే సీఎం కేసీఆర్ పీఆర్సీ పైన ఆర్దిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.

ఉద్యోగ సంఘాల నేతలు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. పీఆర్సీని ఏర్పాటు చేయాలని, సీపీఎస్ ను రద్దు చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు తదితర డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు, అసెంబ్లీ వేదికగా పీఆర్సీపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

సీపీఎస్ రద్దు పై స్పష్టత ఇస్తారా: రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభం కాగా, సీఎం ఆ ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. ఈ చివరి రోజు సీఎం సభకు వచ్చి ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తారని, పీఆర్సీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తారని అంటున్నారు.

అయితే పీఆర్సీ ఏర్పాటుతోపాటు ఐఆర్‌పై కూడా ప్రకటన చేస్తారన్న ఆశాభావంతో ఉద్యోగులు ఉన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేసినా.. ఇప్పట్లో నివేదిక ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ నివేదిక వచ్చే వరకు, ఫిట్‌మెంట్‌ను ప్రకటించేవరకు ఐఆర్‌ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇక ఇటీవల కురిసిన వర్షాలు, వరదలపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. పంట నష్టం ఎంత జరిగిందన్న వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.