టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. ఖుషీ. విజయ్ దేవరకొండ హీరో. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మలయాళ నటుడు జయరాం, సతీష్ ఖెడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.. ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తోన్నారు. సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
సమంత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకోనున్నట్లు వార్తలొస్తోన్నాయి. చికిత్స తీసుకోవాల్సి ఉన్నందున కొద్దిరోజుల పాటు సినిమాలకు పుల్ స్టాప్ చెప్పాలనే నిర్ణయంలో ఉన్నట్లు చెబుతున్నారు. సంవత్సర కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో- మయోసైటిస్ చికిత్స కోసం సమంత.. ఓ టాలీవుడ్ స్టార్ హీరో వద్ద 25 కోట్ల రూపాయల మేర అప్పు తీసుకున్నారనే టాక్ ఉంది. జాతీయ మీడియా సైతం దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ వార్తలపై సమంత స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పస్టం చేశారు. చికిత్స కోసం అప్పు గానో.. ఆర్థిక సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరమో తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.
తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆమె పోస్ట్ చేశారు. మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్ల రూపాయలా?.. అంటూ సమంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. మయోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం ఈ 25 కోట్ల రూపాయల్లో అతి తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తోన్నానని, అందుకు సంతోషిస్తున్నానని చెప్పారు.
ఇప్పటి వరకు తాను చాలా సినిమాల్లో నటించానని, అందుకు రెమ్యునరేషన్‌గా డబ్బులే వచ్చాయని, రాళ్లు తీసుకోలేదంటూ సెటైర్లు వేశారు. తన దగ్గర చాలినంత డబ్బులు ఉన్నాయని, ఆరోగ్యగాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలననీ పేర్కొన్నారు. మయోసైటిస్ వల్ల వేలాదిమంది బాధపడుతున్నారని, వారి విషయంలో కాస్త బాధ్యత వహించాల్సిన అవసరం ఉందనీ వ్యాఖ్యానించారు.