TELANGANA

కెసిఆర్ రాజకీయానికి తుమ్మల బలయ్యారా?

అది 2014. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. కాకపోతే అనుకునేంత స్థాయిలో మెజారిటీ రాలేదు.

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక సీటు దక్కించుకోవలసి వచ్చింది. దీంతో పార్టీని విస్తరించుకునే పనిలో పడ్డారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు. పాత పరిచయాల నేపథ్యంలో ఎమ్మెల్సీని చేశారు. ఆ తర్వాత రోడ్డు భవనాల శాఖను కట్టబెట్టారు. ఈలోగా పాలేరు ఎమ్మెల్యే రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూయడంతో ఆయన భార్య మీద ఆ స్థానాల్లో పోటీ చేశారు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సంవత్సరాల పాటు మంత్రిగా అధికారాన్ని అనుభవించారు. తర్వాత ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లడంతో తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.

ఓటమి

2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం కందాల ఉపేందర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఓడిపోయిన అనంతరం తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ పెట్టారు. కానీ దానిని అమలు చేయలేకపోయారు. భారత రాష్ట్ర సమితి ప్లీనరీ ఖమ్మంలో నిర్వహించిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలు మొత్తం తుమ్మల నాగేశ్వరరావు అప్పగించారు. అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చాకచక్యంగా తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించారు. త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ ఇస్తామని ఆశపెట్టిన అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల వైపే మొగ్గు చూపింది. దీంతో తుమ్మల వర్గంలో నైరాశ్యం అలముకుంది. కేవలం రాజకీయంగా పార్టీని విస్తరించేందుకే తుమ్మలను బలి పశువును చేశారని ఆయన అనుచరులు అంటున్నారు.

అనుచరుల అసంతృప్తి

భారత రాష్ట్ర సమితి అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో కొన్ని రోజులుగా ఆయన అనుచరులు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితి పార్టీని వీడి కాంగ్రెస్లోకి రావాలని కోరుతున్నారు. కాంగ్రెస్ లోకి వచ్చి పాలేరు లేదా ఖమ్మం నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కోరుతున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా అసంతృప్తితో ఉండడంతో ఆయనను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ను రంగంలోకి దింపారు. అయితే వారి వద్ద కూడా తుమ్మల నాగేశ్వరరావు తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిసారి కూడా తుమ్మల నాగేశ్వరరావు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించుకుంటూ వచ్చారు. ఆయన అనుచరులు కూడా దీనిని బలంగానే నమ్మారు. కానీ చివరి నిమిషంలో భారత రాష్ట్ర సమితి అధిష్టానం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపడంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పైగా తనకు ఇవే చివరి ఎన్నికలని, ఇక వచ్చే టర్మ్ లో పోటీ చేసే అవకాశం లేదని తుమ్మల నాగేశ్వర రావు అంటుండడం చర్చకు దారితీస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుంటే తన అనుచర వర్గం మొత్తం చెల్లాచెదురు అయిపోతుందని తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి తన వేగుల ద్వారా వర్తమానం పంపారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నుంచి ఆయన పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.