APTELANGANA

కుల, గుల పత్రిక అంటావా కేసీఆర్.. బట్టలు చింపుకున్న ఆర్కే

: ‘మీడియా అంటే న్యూట్రల్ గా ఉండాలి. వార్తలను వార్తలుగా రాయాలి. కేవలం విషం చిమ్మడమే పనిగా పెట్టుకోకూడదు. నేను ఉద్యమ సమయంలో నుంచి చెబుతూనే ఉన్నాను.

కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద అవి విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయి. అటువంటి పత్రికలలో పనిచేసే పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోం. ఇది మా ప్రభుత్వ పాలసీ.” ఇవీ నిన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రికేయుల ఇళ్ల స్థలాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు. సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కెసిఆర్ కు వ్యతిరేకంగా వార్తలు కేవలం ఆంధ్రజ్యోతి మాత్రమే రాస్తుంది. వెలుగు బిజెపి ఫోల్డ్ లో పనిచేస్తుంది కాబట్టి దానికి ఎలాగూ తప్పదు. సో ఇక్కడ వెలుగుతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రజ్యోతికి రీచ్ ఎక్కువ. సహజంగానే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్రజ్యోతి స్పందించింది. స్పందించింది అంటే తనది కుల పత్రిక అని ఒప్పుకున్నట్టేనని విశ్రాంత పాత్రికేయులు అంటున్నారు. ముఖ్యమంత్రి సమావేశానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకుండానే టికెట్ల కేటాయింపు విషయాన్ని” సగం అగ్రకులాలకే” అనే శీర్షికతో ఈరోజు ఎడిషన్ ను అచ్చేసింది.

అంతేకాకుండా అధిక ప్రసంగం పేరుతో కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటలకు ఎడిటోరియల్ లో కౌంటర్ ఇచ్చింది. “అధికారంలో ఉండే ఉన్మత్తత అటువంటిది. అందుకే రాజకీయాలలో ఉన్నవారు ఆ మాదకద్రవ్యం కోసం యాతన పడుతుంటారు. ఒక్కసారి మైకం కమ్మిన తర్వాత విచక్షణలు, వివేచనలు ఏవీ పనిచేయవు. దేనినైనా అతిక్రమించవచ్చునని, ఏవైనా మాట్లాడవచ్చునని అనిపిస్తూ ఉంటుంది. పాలకుడు స్వభావరీత్యా అహంకారి అయినప్పుడు, అతడి నోటికి పట్టపగ్గాలు ఉండవు.. అడ్డగోలుగా మాట్లాడుతూ కూడా దానొక విధానం అని, ఇష్టమని డబ్బాయించగలడు” ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కార్నర్ చేసుకుంటూ ఆంధ్ర జ్యోతి రాసుకుంటూ పోయింది. వాస్తవానికి ముఖ్యమంత్రిని టాకిల్ చేసే విషయంలో ఆంధ్రజ్యోతి కొంచెం టెంపర్ మెంట్ ప్రదర్శించినప్పటికీ.. మిగతా విషయాల్లోనే గాడి తప్పుతోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహార శైలికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో హిట్లర్ అని సంబోధించాడు. కెసిఆర్ దురహంకారి అని రాసుకొచ్చాడు. వాస్తవానికి వారి విధానాల తప్పులు ఉంటే దానిపరంగా విమర్శించాలి. మీడియా సహజ లక్షణం కూడా అదే. అంతేగాని ముఖ్యమంత్రికి కులాన్ని ఆపాదించడం ఏమిటో విలువల సారం గురించి బోధిస్తున్న రాధాకృష్ణ కే తెలియాలి.

వాస్తవానికి మీడియా స్వాతంత్రం గురించి చెబుతున్న రాధాకృష్ణ.. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఏ స్థాయిలో స్వాతంత్రం ఇస్తున్నారు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ శుద్ధ పూస అని చెప్పడం లేదు. ఆయన కాంపౌండ్ నుంచి ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ కూడా ఆ భారతీయ జనతా పార్టీ మీద, ఇతర విపక్షాల మీద ఏ స్థాయిలో బురద చల్లుతున్నాయో తెలిసిందే. న్యూట్రాలిటీ గురించి మాట్లాడే కేసీఆర్ వీటి గురించి కూడా చెబితే బాగుంటుంది. రాధాకృష్ణతో వైరం ఉన్నప్పుడు ఆ నేరుగా కేసీఆర్ అతడితోనే తేల్చుకోవాలి. మధ్యలో ఉద్యోగులను బలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? స్థలాలు ఇవ్వబోము చెప్పినంత మాత్రాన రేపటి నాడు నష్టపోయేది రాధాకృష్ణ కాదు ఉద్యోగులు.. ఇక పాత్రికేయ ధర్మం గురించి వీర లెవెల్లో స్పీచ్ లు ఇచ్చే రాధాకృష్ణ.. ముఖ్యమంత్రిని విమర్శించడంలో ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఇదే సమయంలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల కెసిఆర్ కు అనుకూలంగా ఎలాంటి రాతలు రాశాడో అందరికీ తెలుసు. 2018 ఎన్నికల్లో తన బాస్ చంద్రబాబుకు అనుకూలంగా రాయాల్సి వచ్చింది కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు. లేకుంటే ఆంధ్రజ్యోతి కాస్త మరో నమస్తే తెలంగాణ అయ్యేది. ముఖ్యమంత్రి ఏదో మాట వరసకు కుల, గుల పత్రికలు అని వ్యాఖ్యానించారు. కానీ దాన్ని అలా వదిలేస్తే గాలికి పోయే పేలపిండి అయ్యేది. అలా కాకుండా రాధాకృష్ణ అధిక ప్రసంగం పేరుతో తనకు అంటించుకునే ప్రయత్నం చేశారు. అంటే కెసిఆర్ దృష్టిలో తన పత్రికకు కుల, గుల ఉందని చెబుతున్నట్టేనా?!