రాయ్‌పూర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వాడివేడిగా విమర్శలు, ప్రతి విమర్శలను సంధించుకుంటోన్నారు.
ఆరోపణలు- ప్రత్యారోపణలకు దిగుతున్నారు అన్ని పార్టీల నాయకులు.
తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన సస్పెండెడ్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ తెరపైకి వచ్చారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలను సంధించారు. ఒవైసీ వంటి వాళ్లకు భారత్‌లో నివసించే హక్కు లేదంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారాయన.
పార్లమెంట్‌లో మూకదాడి జరుగుతుందంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను రాజా సింగ్ తప్పుపట్టారు. పార్లమెంట్‌లో మూకదాడి జరుగుతుందో? లేదో తెలియదు గానీ.. ఒవైసీపై మాత్రం దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని తేల్చి చెప్పారు. ఒవైసీ వంటి వాళ్లకు భారత్‌లో నివసించే హక్కు లేదని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే హక్కు ఒవైసీకి లేదని రాజాసింగ్ అన్నారు. తన పార్టీ తరఫున ఎంతమందికి ఒవైసీ టికెట్లు ఇచ్చావని ప్రశ్నించారు. రాజకీయంగా మహిళలకు ఎలాంటి ప్రాతినిథ్యం కల్పించావంటూ నిలదీశారు. తనపై హైదరాబాద్ లోక్‌సభలో స్థానంలో పోటీ చేయాలంటూ రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసరడం పట్ల రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీని హైదరాబాద్ ఎంపీ స్థానంలో తనపై పోటీ చేయాలంటూ సవాల్ చేయడం కాదని, దమ్ముంటే గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనపై పోటీకి దిగాలంటూ ఒవైసీకి రాజా సింగ్ సవాల్ విసిరారు. ధైర్యం లేకపోతే- తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీని అయినా తనపై పోటీకి నిలపాలని అన్నారు. ఆయనకూ దమ్ము, ధైర్యం లేకపోతే మజ్లిస్ నుంచి ఎవరినైనా పోటీకి దింపాలని సూచించారు.
ఒవైసీ వంటి పాములను కాంగ్రెస్ పెంచి పోషించిందని, ఆ పార్టీ అలాంటి పని చేయకపోయి ఉంటే ఒవైసీ వంటి వాళ్లకు ఇప్పుడు మాట్లాడటానికి నోరు పెగిలేది కాదని విమర్శించారు. పాతబస్తీకి చెందిన ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ గానీ, ఆయన తండ్రి సలాహుద్దీన్ ఒవైసీ గానీ న్యాయం చేయలేదని అన్నారు.
గతంలో ముస్లిం ఓట్లను కాంగ్రెస్‌కు, ఇప్పుడు బీఆర్ఎస్‌కు తాకట్టుపెట్టిన చరిత్ర ఒవైసీ కుటుంబానికి ఉందంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ముస్లింల అమాయకత్వాన్ని తన ఓటుబ్యాంకుగా మార్చుకుంటోందని ఆరోపించారు. ఒవైసీ కుటుంబం తమకు అన్యాయం చేస్తోందనే విషయం తెలిసినా ముస్లింలు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు.