TELANGANA

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్‌ సాగర్‌కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ దీన్ని ప్రారంభించారు.

అదే- లేక్ ఫ్రంట్ పార్క్. మొత్తం 26 కోట్ల రూపాయలతో ఈ పార్క్‌ను నిర్మించింది హెచ్ఎండీఏ. ఇందులో పార్క్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు, సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలను వ్యయం చేశారు. ఈ పార్క్‌లో మొత్తం నాలుగు లక్షల మొక్కలను నాటారు. విభిన్న జాతులకు చెందిన 40 రకాల మొక్కలు ఇందులో ఉన్నాయి. ఒక్కో మొక్కకూ బార్‌కోడ్‌ లేబుల్‌ను అతికించారు.

ఈ పార్కులో నాలుగు నడక మార్గాలను ఏర్పాటు చేశారు. వాటి పొడవు 110 మీటర్లు. 15 మీటర్ల విస్తీర్ణం గల కాంటిలివర్ జెట్టీని ఇది కలిగి ఉంటుంది. ఇది కాకుండా- 240 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు ఉన్న కర్విలీనియర్ వాక్‌వే, 690 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో వాక్‌వే అందుబాటులోకి వచ్చాయి.

లేక్ ఫ్రంట్ పార్క్‌లో మంటపాలు, హుస్సేన్ సాగర్ తీరం వెంబడి ప్రొమెనేడ్ ఏరియా, అండర్‌పాస్‌, సెంట్రల్ పాత్‌వే వంటివి ఉన్నాయి. ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్, బొల్లార్డ్ లైటింగ్, హైమాస్ట్ లైటింగ్, కాలమ్ లైటింగ్, బోర్డ్ వాక్ వెంట నియోఫ్లెక్స్ లైటింగ్.. ఈ పార్క్ ప్రత్యేకతలు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లు, టికెట్ కౌంటర్లు, టాయ్‌లెట్ వసతి ఉంది.

తెల్లవారు జామున 5:30 నుంచి రాత్రి 11: 30 గంటల వరకు ఈ పార్క్‌ను సందర్శించవచ్చు. ఎంట్రీ ఫీజు పెద్దలకు 50 రూపాయలుగా నిర్ధారించారు. పిల్లల ఎంట్రీ ఫీజు 10 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. మార్నింగ్ వాకర్స్ కోసం 100 రూపాయల చెల్లించి నెలవారీ పాస్ పొందే అవకాశం ఉంది.