TELANGANA

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. పీహెచ్. డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా గాంధీ జయంతి సాక్షిగా మరోమారు పీహెచ్. డీ అడ్మిషన్ల వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది.

పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై గత కొద్దిరోజులు కేయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు యూనివర్సిటీ విద్యార్థులను అమానుషంగా కొట్టారని కూడా వారు ఆరోపించారు. పోలీసుల చర్యపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. యూనివర్సిటీలో గాయాల పాలైన విద్యార్థులను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించి ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇక తాజాగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన చేపట్టారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని ఆయన విగ్రహం ఎదుట పి.హెచ్.డి అడ్మిషన్ల అవకతవకలపై నిరసన చేపట్టగా, అది ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక ఈ రోజు ఉదయం గాంధీ విగ్రహం ఎదుట చేతులకు సంకెళ్లు, నల్ల రిబ్బన్‌లతో నిరసన దీక్ష చేపట్టారు.

11 గంటలలోగా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోతే 12 గంటలకు ఆత్మార్పణకు పాల్పడతామని విద్యార్థులు హెచ్చరించారు. అయితే ఆత్మార్పణ చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని తరలించేందుకు పోలీసులు యత్నించారు. పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక తమ నిరసనలో భాగంగా గాంధీ విగ్రహం దగ్గర ఇనుప సంకెళ్లతో విద్యార్థులు తమను తాము బంధించుకున్నారు.

తెలంగాణా ఎన్నికల బరిలో జనసేన.. సంసిద్ధం కావాలన్న పవన్ కళ్యాణ్!!

దీంతో కట్టర్లతో ఇనుప సంకెళ్లు తెంచి విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.గాంధీ జయంతి రోజున శాంతియుతంగా మౌన నిరసన దీక్ష చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయటం పట్ల కేయూ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విద్యార్థుల అరెస్టుకు నిరసనగా రేపు కేయూ బందుకు జాక్ నేతలు పిలుపునిచ్చారు. మరి ఈ రగడ ఎంత కాలం ఇలాగే కొనసాగుతుందో, దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.