సూర్యాపేటలో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్ కు అమ్ముడుపోతారు అంటూ తెలిపారు. గ్రామ పంచాయితీ నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి లేకుండా చేస్తాం అని కిషన్ రెడ్డి అన్నారు. ఇక, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఖరారైన బీజేపీ అభ్యర్ధులను సభకు పరిచయం చేశాను అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్స్ జాతీయ రహదారి, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడంలో అధికార పార్టీ విఫలం అయ్యింది.. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకం అమలు చేస్తాం.. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాము.. ప్రజలకు అందుబాటులో ప్రతీ రోజు కార్యాలయానికి వచ్చే సీఎం వస్తారు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది అని కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బి-టీమ్ అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి.. కాంగ్రెస్‌లో పనిచేసింది రాహుల్ గాంధీకి తెలియదు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కేసీఆర్ పని చేశారు.. గతంలో అనేక ఎన్నికల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.