తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలలో మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) కూడా ఒకటి. జాతీయస్థాయిలో పాపులారిటీ ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ పార్టీకి నాయకుడు. ముస్లిం, మైనారిటీల సమస్యలపై ప్రశ్నిస్తూ ఎంఐఎం తెలంగాణతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా పలు రాష్ట్రాల ఎన్నికలలో కూడా పోటీచేస్తోంది.
మరి జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న ఎంఐఎం పార్టీ సొంత రాష్ట్రమైన తెలంగాణ ఎన్నికలు వచ్చేసరికి ఎప్పుడూ పాతబస్తీ(ఓల్డ్ సిటీ)లోని కేవలం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేస్తుంది. కారణం లోకల్‌గా అధికారంలో ఉన్న పార్టీలతో స్నేహం.
ఇంతకుముందు సమైక్యాంధ్ర ప్రదేశ్ సమయంలో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకునేది. ఇప్పుడు తెలంగాణ వచ్చాక అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో ఫ్రెండ్లీగా ఉంది. ఎంఐఎం ఇతర రాష్ట్రాలలో ఎక్కడ పోటీచేసినా అది బీజేపీకి లాభం చేకూర్చేలా ఉంటుంది. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలకు వచ్చే ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
అందుకు ఇటీవల ఎంఐఎం, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణలో బీజేపీకి అధికారంలో వచ్చే సీన్‌లేదు కాబట్టి.. బీజేపీతో లోలోపల ఒప్పందం చేసుకున్న కేసీఆర్ పార్టీకి అసదుద్దీన్ జైకొడుతున్నారు. అందుకే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి పోటీచేయనున్నారు.
గతంలో రాష్ట్రంలోని 20 నియోజకవర్గాల్లో అంటే ముస్లింల ప్రాబల్యమున్న కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీచేస్తుందని అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే ఎన్నికల సమయానికి యథావిధిగా ఓల్డ్ సిటీ వరకే ఎంఐఎం పరిమితమయ్యేది. కానీ ఈ సారి ఓల్డ్ సిటీతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయబోతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధుల మీద బాగా వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో బలంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడే అవకాశం ఎక్కువ. కానీ అజారుద్దీన్ ముస్లిం కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు ముస్లిం ఓట్లు ఆయనకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ముస్లిం ఓట్లు అన్ని రాకుండా అడ్డుపడేందుకే ఎంఐఎం పోటీ చేస్తోందని అర్థమవుతోంది. ఈ పోటీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా లాభం కలుగుతుంది.
కానీ ఎంఐఎం పార్టీ మాత్రం బీఆర్ఎస్ తమ మిత్ర పార్టీ అయినా దానిపై ఫ్రెండ్లీ కంటెస్ట్‌గా మాత్రమే బరిలోకి దిగుతున్నట్లు చెబుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రభుత్వ ఓట్లు చీల్చడానికే ఎంఐఎం కొత్తగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని ఆరోపిస్తున్నారు.