ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అసంతృప్తి సెగలు కాకరేపుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో తుల ఉమ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన బీజేపీ.. ఆమెకు బీఫామ్ ఇవ్వకుండా వికాస్‌రావును బరిలో దించడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
తనకు టికెట్ కేటాయించి ఆ తర్వాత బీఫామ్ ఇవ్వకుండా పోటీ నుంచి తప్పించడంతో బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తుల ఉమ. ఎవరైనా బీజేపీ నేతలు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతానని అంటున్నారంటే… వారిపై ఆమె ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారో అర్థమైపోతుంది.
బీసీలకు అండగా ఉంటామని చెబుతూనే.. అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తున్నారని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. మాట్లాడితే బీసీలను చెప్పుకునే బండి సంజయ్.. బీ ఫాం మాత్రం దొరలకాళ్ల దగ్గర పెట్టారని మండిపడ్డ తుల ఉమ.. బీజేపీలో మహిళలకు స్థానం లేదని వెక్కి వెక్కి ఏడ్చారు.
ఇక కమలనాథులపై అసహనంగా ఉన్న తుల ఉమను తమ పార్టీలోకి లాక్కునేందుకు పలు పార్టీల నేతలు ఆమె ఇంటికి క్యూ కట్టారు. కాంగ్రెస్‌లో చేరాలని ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆహ్వానం పలికినట్టు సమాచారం. బీఆర్ఎస్ నేతలు కూడా తమ పార్టీలో చేరారని చర్చలు జరిపారు. అయితే,.. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని తెలిపిన తుల ఉమ గులాబీ గూటికి చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.