తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. రాజకీయ విమర్శలతో నాయకులు కాక మీద ఉన్నారు. తెలంగాణలో ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ఉంది. అయితే బీజేపీ కూడా తామే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నప్పటికీ గ్రౌండ్ రియాల్టీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీజేపీ – జనసేన ద్వయం మూడో స్థానానికే పరిమితమవుతాయంటూ సర్వేలు ఘోషిస్తున్నాయి. రెండు సార్లు బీఆర్ఎస్‌కు పట్టం కట్టిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇక అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్‌లో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువని. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న కొందరు నేతలు ఎవరికి వారే కాబోయే సీఎం తామేనని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు.
Advertisement
కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు..?
Advertisement
వీరి సంగతి ఇలా ఉంటే.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సీఎం ఎంపికలో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుందన్నది ఇటీవలే జరిగిన కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోంది.ఈ క్రమంలోనే అధిష్టానానికి నమ్మినబంటు, ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వ్యక్తి, క్లిష్ట సమయంలోనూ పార్టీ వీడని నేత, ఏ పదవి ఇచ్చినా దానికి వన్నె తెచ్చే వ్యక్తి వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అదో మహా సముద్రం. ఏ నేత దగ్గరికి వెళ్లి చిన్న పాటి ఇంటర్వ్యూ తీసుకున్న కచ్చితంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరని..? మహాసముద్రంలాంటి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తారని చెప్పాలంటే కష్టమే. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
ఈ మధ్య ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఇదే ప్రశ్న ఎదురైంది. పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ సీఎం అభ్యర్థులే అనుకుని కష్టపడాలని, ప్రజలు వారిని గెలిపించాలని చమత్కరించారు. అయితే, సీఎం కావాలన్న బలమైన కోరిక రేవంత్‌రెడ్డిలోనూ ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ రేవంత్ రెడ్డే సీఎం అభ్యర్థి అని అనుకుంట.. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాలు ప్రారంభించి.. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగిన మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించే నేతలూ లేకపోలేదు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కాకుండా సీనియర్లలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా తమకు ఓకే అని ఆ నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది.
నేనే సీఎం అవుతానంటూ ఇప్పటికే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..ఎప్పటికైనా సీఎం అవుతానని జగ్గారెడ్డి, అధిష్టానం అవకాశం నాకు ఇవ్వకపోతుందా? అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ను నేను ఉన్నా కదా అని జీవన్‌రెడ్డి ఇలా ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు.. కానీ, హైకమాండ్ దృష్టిని ఆకర్షించిన నాయకుడు మాత్రం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అని విశ్వసనీయ సమాచారం.అసలు భట్టి వైపు అధిష్టానం మొగ్గుచూపడం వెనుక పెద్ద ప్లాన్ కూడా ఉందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది.
భట్టి వైపు కాంగ్రెస్ హైకమాండ్ చూపు
ప్రస్తుతం మధిర శాసనసభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తోన్న భట్టి.. మరోసారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు సీపీఐ సపోర్ట్ ఉండడం,ఈ మధ్య టీడీపీ నేతలు కలిసి భట్టికి మద్దతు ప్రకటించడంతో మరింత జోష్‌తో ముందుకు సాగుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.ఇప్పటికే 2009, 2014 ఎన్నికలలో శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యారు విక్రమార్క,2009 నుండి 2011 వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. 2011 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు,అంతేకాదు, బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
కేసీఆర్ వ్యూహంలో చిక్కుకుని చాలా మంది పార్టీని వీడినా కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఆయన పార్టీతోనే ఉన్నారు. అంతేకాదు.. తన నియోజకవర్గంలో మొదట పాదయాత్ర నిర్వహించి ప్రజాసమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన ఆయన ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో పాదయాత్ర నిర్వహించారు.ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్రం మొత్తం 108 రోజులు కొనసాగి ఖమ్మంలో ముగిసింది.17 జిల్లాలు,36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1350 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తన పాదయాత్రలో వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల పరిష్కార మార్గాలను సైతం ఆయన చూపుతూ వచ్చారట.. ఇవన్నీ ఆయన్ని అధిష్టానం దృష్టిలో పడేలా చేశాయని చెబుతున్నారు.
Advertisement
భట్టి విక్రమార్కనే ఎందుకు..?
ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ మదిలో భట్టి విక్రమార్కనే ఎందుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సమాధానం కూడా సంతృప్తి పరిచేలానే ఉంది. ఎందుకంటే భట్టికి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వివాదారహితుడిగా పేరుంది. మల్లు భట్టి విక్రమార్కను సీఎంను చేస్తే అటు సీనియర్ల నుంచి గానీ, ఇటు జూనియర్ల నుంచిగానీ పెద్దగా వ్యతిరేకత ఉండదనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక దళిత సామాజిక వర్గానికి చెందిన వారే సీఎంగా ఉంటారని అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
కానీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం దాటవేసేవారని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామని బాహాటంగానే ప్రకటన చేసిన కేసీఆర్ ఆ తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ చెబుతోంది. మాటిచ్చి మాట తప్పిన కేసీఆర్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. తాము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేసి మాట నిలబెట్టుకుని ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే దళిత వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిని చేసి,కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ స్కెచ్ గీసినట్లు సమాచారం. ఉన్నత విద్యావంతుడు, వివాదారహితుడు, పార్టీలో అందరి సపోర్ట్ ఉన్నవాడు, పార్టీ లైన్‌లో ఉండేనేతగా పేరున్న మల్లు భట్టి విక్రమార్కను సీఎంను చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా హైకమాండ్ ఆయనకు సూచించినట్టు చర్చ సాగుతోంది.