తెలంగాణ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరడంతో ఇవాళ సాయంత్రం వరకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. రాష్ట్రంలో అధికార పీఠమెక్కాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు విస్తృత ప్రచారం చేశారు. శాసనసభ ఎన్నికల ప్రచారపర్వంలో ఆఖరి రోజైన మంగళవారం.. కాంగ్రెస్ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రజల్లోకి వెళ్లారు.
మంగళవారం మల్కాజిగిరిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ రోడ్డు షోలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దొరల తెలంగాణ పోయి.. ప్రజల తెలంగాణ రావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఒక్ కుటుంబం కోసం కాదని కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ప్రభుత్వానికి ఓటేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ప్రజా ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు.
ఈ రోడ్ షోలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు మద్దతుగా ప్రచారం సాగింది. నియోజకవర్గంలోని ఆనంద్‌బాగ్ నుంచి ప్రారంభమైన రోడ్ షోలో పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటలకు మైనంపల్లి చిందులు వేశారు. రాహుల్, ప్రియాంక, రేవంత్ చేతులు ఊపుతూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అది నెరవేరలేదన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసి అవినీతిక పాల్పడ్డారని ఆరోపించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ప్రియాంక ఆరోపించారు. తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారని తెలిపారు. రూ. 400 గ్యాస్ సిలిండర్ ధరను రూ. వెయ్యికిపైగా పెంచారని కేంద్రంపై మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పరస్పరం సహకరించుకుంటున్నాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు.