TELANGANA

వైన్స్, రెస్టారెంట్లు బంద్, 144 సెక్షన్: ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ వ్యాప్తంగా ఆంక్షలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా నగరంలో 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లకూ ఈ నిబంధన వర్తిసుందని అధికారులు ఆదేశించారు.

 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సందర్భంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

 

మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లు కూడా మూసివేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సందీప్‌ శాండిల్య హెచ్చరించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో 15 కౌంటింగ్‌ కేంద్రాలున్నట్లు పేర్కొన్నారు. నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు.

 

ఐదుగురు, అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమికూడదని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రాలకు కిలోమీటరు దూరంగా జెండాలు, కర్రలు, పేలుడు పదార్థాలు, గుమికూడటం, సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించారు. ప్రజలను ఉద్దేశించి మైకుల్లో ప్రచారం, సమావేశాలు, ఆటపాటలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఆంక్షలను ఉల్లంఘించినవారిపై కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.