APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

 

తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తుపాను ప్రభావంతో.. నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి.

 

ఆదివారం సాయంత్రానికి మిచౌంగ్.. పుదుచ్చేరికి 260 కిలోమీటర్లు, చెన్నైకి 250 కి.మీ. నెల్లూరుకు 380 కి.మీ, బాపట్లకు 490 కి.మీ, మచిలీపట్నానికి 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మిచౌంగ్ తీవ్ర తుపానుగా మారినప్పటి నుంచి తీరం దాటేంతవరకూ గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రకాశం జిల్లాపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. నేడు, రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

 

తుపాను హెచ్చరికల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నాహాలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సీఎం జగన్ తో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.

 

ఒడిశాపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్ర అధికారి తెలిపారు. మల్కన్ గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాంలలో డిసెంబర్ 4,5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో వ్యవసాయ శాఖ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే 54 రైళ్లను రద్దు చేసింది. మత్య్సకారులు తదుపరి నోటీసు వచ్చేంతవరకూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

 

తమిళనాడులోని మహాబలిపురం సముద్ర మట్టం 5 అడుగుల మేర పెరిగింది. దీంతో సముద్రంలో వేటను నిషేధించారు. పర్యాటకులను సైతం అనుమతించడంలేదు. డిసెంబర్ 4,5 తేదీల్లో చెన్నై, చెంగల్ పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం మీదుగా తూర్పు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణశాఖ తెలిపింది.