TELANGANA

BRS ఓటమికి కారణాలు ఇవే..!!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అంతగా ఆదరించలేదు? బీఆర్ఎస్ పార్టీ ఓటమి వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. బి ఆర్ ఎస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై ఒక రిపోర్ట్.

 

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గత రెండు దఫాలు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పు ఫలితమే కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత, తాము ఎవరిని నిలబెట్టిన జనం గెలిపిస్తారన్న అతి విశ్వాసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలపై నిరంకుశ వైఖరి వెరసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది.

 

Telangana Elections: These are the reasons for BRS defeat!!

తెలంగాణ ప్రజలలో కెసిఆర్ పట్ల విశ్వాసం తగ్గిపోవడం, కొద్దిరోజులు మోడీని పొగిడి, కొద్దిరోజులు మళ్లీ తిట్టడం వంటి కారణాలు, మీడియాలో పదేళ్లుగా వ్యతిరేక వార్తలు రాకుండా మీడియాపై నిరంకుశ ధోరణి అవలంబించడం, సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రచారం చేసుకోవడం ప్రజలకు నచ్చలేదు.

 

తెలంగాణ వాదంతో వచ్చిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టడం, జాతీయ పార్టీగా అవతారమెత్తి జాతీయ పార్టీల విషయంలో గడియకో మాట మాట్లాడడం, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కెసిఆర్ ఎదగాలని చేసిన ప్రయత్నం కూడా ప్రజలకు రుచించలేదు. సొంత రాష్ట్రంలో సమస్యలను పక్కనపెట్టి దేశాన్ని ఉద్ధరించడానికి దేశ్ కి నేత అని చెప్పే ప్రయత్నం కూడా నచ్చలేదు.

 

అవినీతిపరులు అయిన నాయకులను వెనకేసుకు రావడం, యువతకు ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ కావడం, ప్రశ్నాపత్రాల లీకేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు లీకేజీలు ఇవేవీ ప్రజలకు నచ్చలేదు. 2014లో గెలిచినప్పుడు ఉద్యోగులకు వరాలు ఇచ్చి, రెండోసారి గెలిచినప్పుడు నిర్లక్ష్యం చేయడంతో పాటు, సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఉద్యమ పార్టీ అయ్యుండి ఉద్యమకారులను దూరం చేయడం కూడా ప్రజలకు నచ్చలేదు.

 

సింగరేణి కార్మికులలో ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత సింగరేణి లోను బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసింది. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ లో కొడుకు కేటీఆర్ ప్రమేయం వంటి కారణాలతో ప్రజలలో పార్టీ పట్ల అయిష్టత పెరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు బీఆర్ఎస్ ఓటమికి వందల కారణాలు ఉన్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలపై అధ్యయనం చేసి, తప్పు దిద్దుకుని హుందాగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.