TELANGANA

తెలంగాణ జెన్‌కో పరీక్షలు వాయిదా..!!

తెలంగాణ జెన్‌కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. దీన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది వెల్లడించలేదు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ www.tsgenco.co.in లో పొందుపరుస్తామని తెలిపింది.

 

ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు, కెమిస్ట్స్ పోస్టులను భర్తీ చేయడానికి ఇదివరకు నోటిఫికేషన్‌ను జెన్‌కో అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో ఈ నోటిఫికేషన్ వెలువడింది. దీనికోసం వేలాదిమంది అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేశారు. ఈ పరీక్షల కోసం సన్నద్ధమౌతోన్నారు.

 

Telangana Genco exams was postponed

అదే రోజున అంటే ఈ నెల 17వ తేదీ నాడే ఇతర సంస్థలు/ప్రభుత్వ పోటీ పరీక్షలు కూడా జరుగనున్నాయి. ఒకే రోజున అటు జెన్‌కో, ఇటు ఈ పోటీ పరీక్షలను రాయాల్సి రావడం వల్ల అభ్యర్థులు, విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయాన్ని వారు ప్రజా వాణి ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. జెన్‌కో రాత పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

 

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. జెన్‌కో రాత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కార్యాలయం అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా వెల్లడించాల్సి ఉంది.