TELANGANA

ప్రజా భవన్ ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం!!

తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి దూకుడుగా పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆటోడ్రైవర్లతో నిరసన సెగ తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని అందిస్తున్నారు.

 

ఈ క్రమంలో ఆటోలకు ఊహించని విధంగా గిరాకీ తగ్గింది. దీంతో ఈ పథకం ప్రారంభం నుండి ఆటోవాలాలు దీనిపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. మహిళలంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉండటంతో హైదరాబాద్లో మెట్రో రైళ్లతో పాటు ఆటోలకు గిరాకీ బాగా తగ్గింది.

 

ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకం పై భారతీయ మజ్దూర్ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు 70శాతం మంది మహిళలు ఆటో ఎక్కే వారిని, అప్పుడు అటో డ్రైవర్ ల ఆదాయం రోజుకు 1000రూపాయలుగా ఉండేదని వారి రోజువారి సంపాదన ఇప్పుడు 300రూపాయలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ పథకంతో తమ పొట్ట కొడుతున్నారని పేర్కొన్నవారు తమకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఆటోలను పెట్టుకోవాలని కోరుతున్నారు. లేదంటే బస్సుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా రవాణా చట్టానికి తూట్లు పొడిచి ఓలా, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధికి గండి కొడుతుందని వారు ఆరోపిస్తున్నారు.

 

ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని, చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రజా భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 8 లక్షల ఆటో డ్రైవర్ల భవిష్యత్తు అంధకారంలో ఉందని, సీఎం రేవంత్ రెడ్డి విషయంపై స్పందించాలని వారి డిమాండ్ చేస్తున్నారు.