TELANGANA

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క..

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైంది. తాజాగా, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు చెప్పారు. అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రిగా తొలి సంతకం చేశారు సీతక్క.

 

ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రూపొందించిన ఫైలుపై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు. మంత్రి నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.

 

అంతేగాక, అంగన్వాడీ టీచర్లకు కూడా మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్‌ మీద కూడా సీతక్క సంతకం పెట్టారు. దీంతో ఇప్పటివరకు రూ.7,500 జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు.. ఇక నుంచి రూ.13,500 జీతం అందుకోనున్నారు. మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

శిశు విహార్ సందర్శించిన మంత్రి సీతక్క హైదరాబాద్ నగరంలోని వెంగళ్‌రావునగర్‌లోని శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ఆవరణలోని శిశువిహార్‌ను మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం సందర్శించారు. అక్కడ పిల్లల గదులు, వంట గది, వసతులను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత చిన్నారులతో సరదాగా ముచ్చటించింది. వారి ఆటపాటలను వీక్షించి అభినందించారు. చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో శిశు సంక్షేమశాఖ కమిషనర్ కృతిఓఝా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

సీతక్క స్వగ్రామానికి బస్సు మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు బస్సు రానుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్వగ్రామానికి రోడ్డు మార్గం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడపడం లేదని డిసెంబర్ 12న మీడియాలో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. త్వరలోనే బస్సు నడిపిస్తానని చెప్పారు. పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు