TELANGANA

మేడారం కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ప్లానింగ్ ఇదీ..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్‌ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణ మహిళలందరికీ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ఈ క్రమంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న మేడారం జాతర ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తోంది.

 

More

From Telangana politics

భక్తులకు శుభవార్త..

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. వరంగల్‌ ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత మాట్లాడుతూ మేడారం జాతరకు డిసెంబర్‌ 17 నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రతీ బుధ, ఆదివారం, సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్‌ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ రోజుల్లో ప్రతీ 45 నిమిషాలకు ఒక ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటుందని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని శ్రీలత సూచించారు.

 

ఫిబ్రవరి 21 నుంచి జాతర

ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. జాతరకు ముందే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ములుగు జిల్లాలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. ఇందులో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి 14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్‌ విభాగానికి 8.28 కోట్లు, పోలీస్‌ శాఖకు 10.50 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 2.80 కోట్లు, రెవెన్యూ శాఖకు 5.25 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు 4.35 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో త్వరలో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు పిలవనున్నారు.

 

జాతర బస్సుల్లో మహిళలకు చార్జీ..?

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో మేడారం జాతరకు కూడా ఉచితంగా వెళ్లొచ్చని మహిళలు భావిస్తున్నారు. ఈజాతరకు ఎక్కువగా మహిళలే రానున్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, కర్ణాటక నుంచి కూడా లక్షలాది మంది తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో జాతర ప్రత్యేక బస్సుల్లో మహిళలందరికీ చార్జి వసూలు చేయాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత ప్రయాణం కొనసాగిస్తే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మహిళలను గుర్తించడం ఇబ్బందిగా మారుతుందని, మరోవైపు ఆర్టీసీకి కూడా తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం చార్జి వసూలు చేసే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.