TELANGANA

అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజి బిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.

 

ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా కేటాయిస్తామ‌ని హామి ఇచ్చారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను రేవంత్‌రెడ్డి ఢిల్లి నార్త్‌ బ్లాక్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో ఈరోజు సాయంత్రం క‌లిశారు.

 

ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి చెందిన ప‌లు అంశాల‌ను అమిత్‌షా దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థ‌ల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని, ప‌దో షెడ్యూల్ ప‌రిధిలోని సంస్థ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని, న్యూఢిల్లిలోని ఉమ్మ‌డి రాష్ట్ర భ‌వ‌న్ విభ‌జ‌న‌ను సాఫీగా పూర్తి చేయాల‌ని, చ‌ట్టంలో ఎక్క‌డా పేర్కొన‌కుండా ఉన్న సంస్థ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్లెయిమ్ చేసుకోవ‌డం విష‌యంపై దృష్టి సారించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

 

తెలంగాణ‌లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బ‌లోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో బ‌లోపేతానికి రూ.90 కోట్లు అద‌నంగా కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌, హైకోర్టు భ‌వ‌నం, లోకాయుక్త‌, ఎస్‌హెచ్ఆర్సీ వంటి భ‌వ‌నాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వ‌డ్డీతో క‌లిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

 

అంతకుముందు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సీఎం రేవంత్ తోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి కలిశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరతూ వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కోరారు.

 

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం: ఉత్తమ్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణ్‌పేట్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ చేశారు. 90 టీఎంసీల నీరు 60 రోజుల్లో లిఫ్ట్ చేసే ప్రణాళిక ఇది అని తెలిపారు.