TELANGANA

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు నేడే చివరిరోజు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంపు చేసింది.

 

కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు హామీలను అమలు చేయాల్సి ఉండగా దీనికోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుంది. అయితే ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ప్రజాపాలనలో భాగంగా 10 రోజులుగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు దరఖాస్తులు చేసుకోని సామాన్య ప్రజలు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

 

దరఖాస్తు గడువు తేదీని పొడిగించే ప్రసక్తే లేదని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నేడు దరఖాస్తులు చేసుకోవాలని, ఈరోజు దరఖాస్తులు చేసుకోకపోతే మళ్ళీ నాలుగు నెలల వరకు ఆగాల్సి వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడత ప్రజా పరిపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ కూడా వెనువెంటనే ప్రారంభించాలని ఈ మేరకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు.

 

ఈనెల 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ కూడా పూర్తి చేసేలా అధికారి యంత్రాంగం చర్యలు చేపడుతోంది. డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పథకం వర్తింపుకు సంబంధించిన ఆదేశాలను ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వకుంటే తమకు సంక్షేమ పథకాలు అందవని పలువురు ఆందోళన చెందుతున్నారు.

 

అధికార యంత్రాంగం అలాంటి భయాలేవీ లేవని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు అనివార్య కారణాలతో దరఖాస్తులు చేసుకోలేనివారు మళ్ళీ నాలుగు నెలలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏది ఏమైనా అవకాశం ఉన్న వారు నేడే చివరి రోజు కావటంతో హర్రీ అప్.