తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో పరి పాలనను వారి వద్దకే తీసుకెళ్తోన్నారు. ఈ క్రమంలో ప్రజా పాలన కార్యక్రమానికి తెర తీశారు. కిందటి నెల 28వ తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం నాటితో ముగిసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. మొత్తంగా 1,25,84,383 దరఖాస్తులు దాఖలు అయ్యాయి.
Praja Palana in Telangana has received 1.25 crore applications so far
ఇందులో అత్యధికం.. ప్రభుత్వ పథకాల కోసం ఉద్దేశించినవే. పక్కా ఇళ్లు, చేయూత, తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయాలంటూ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండో స్థానంలో పక్కా ఇళ్ల దరఖాస్తులు నిలిచాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను పెట్టుకున్నారు.
మహాలక్ష్మి పథకం కింద తమ పేరును నమోదు చేసుకోవడానికీ భారీగా దరఖాస్తులు అందాయి. రైతు భరోసా, గృహ జ్యోతి పథకానికీ భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే రైతు బంధు కింద నిధులు తీసుకుంటోన్న అర్హులైన రైతులు, మళ్లీ ప్రత్యేకంగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోనక్కర్లేదంటూ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా- ప్రజా పాలన కార్యక్రమం గడువు తేదీని పొడిగించబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలుగు నెలల తరువాత మరోసారి ఈ కార్యక్రమంతో ముందుకు వస్తామని, ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వాళ్లకు అప్పుడు అవకాశం ఉంటుందని తెలిపింది. మళ్లీ నాలుగు నెలల తరువాత ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించింది.