అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతన్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటికే రామ మందిరానికి తలుపులు, పాదుకలు ఇక్కడ్నుంచే అయోధ్యకు తరలివెళ్లాయి.
తాజాగా, అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేసిన భారీ లడ్డూను అయోధ్యకు తరలించనున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ 1,265 కిలోల భారీ లడ్డూను తయారు చేసి అయోధ్య శ్రీరాముడికి కానుకగా సమర్పించాలని సంకల్పించారు. అయోధ్య రామయ్యకు సమర్పించేందుకు హైదరాబాద్ లడ్డూ బయలు దేరింది.
కాగా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి అతిపెద్ద లడ్డూ తయారీ చేసేందుకు సికింద్రాబాద్‌కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ వారు అనుమతి తీసుకున్నారు. ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజులు, 30 కిలోల కిస్మిస్లు, 30 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నాగభూషణం రెడ్డి వెల్లడించారు.
ఈ భారీ లడ్డూను అయోధ్య రాముడి ఆలయానికి కి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని తెలిపారు. ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారని నాగభూషణం రెడ్డి వివరించారు. అయోధ్య రాముడికి తెలంగాణ నుంచి ప్రత్యేక కానుకలు తరలివెళ్లడంపై రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.