TELANGANA

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బంగారు చీర!!

దేశమంతా ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతుందా? ఎప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్ళారా చూస్తామా? అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్సవానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి రామయ్యకు కానుకలు తరలి వెళుతున్నాయి.

 

500కు పైగా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాముడు తాను నడయాడిన పుణ్యభూమిలో కాలు పెడుతున్న సమయంలో రామయ్య పైన భక్తితో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రత్యేకమైన బహుమతులు అయోధ్యకు చేరుతున్నాయి. ప్రస్తుతం దేశంలో శ్రీరామ మేనియా కొనసాగుతుంది.

 

ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నాడు టిటిడి తనవంతుగా లక్ష శ్రీవారి ప్రసాదమైన లడ్డులను అయోధ్యకు పంపుతోంది. ఇక మరోవైపు అయోధ్య రామయ్య కు సికింద్రాబాద్ నుంచి శ్రీరామ్ క్యాటరర్స్ 1265 కిలోల భారీ లడ్డును తయారుచేసి రాముడికి కానుకగా పంపించారు. ఇవి మాత్రమే కాదు బంగారు రామయ్య పాదుకలు, రామయ్యకు 108 అడుగుల ఎత్తున్న ప్రత్యేక అగర్బత్తి ని తయారుచేసి పంపించిన భక్తులు ఉన్నారు.

 

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్ అయోధ్య రామయ్యకు బంగారు చీరను నేసి రామయ్యకు పంపిస్తున్నారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను చీరలో నేసినట్టు ఆ చేనేత కార్మికుడు చెబుతున్నారు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఉపయోగించే 20 రోజుల్లో ఈ చీర తయారు చేశామని హరి ప్రసాద్ తెలిపారు.

 

సిరిసిల్ల నేత కార్మికుడు తయారుచేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. దీనిని ఈనెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసి, రాముడి పాదాల చెంతకు చేర్చేలా చూస్తానని బండి సంజయ్ చేనేత కార్మికులకు మాటిచ్చారు. రామయ్య కోసం బంగారు చీర నేయడం తమకు చాలా సంతోషంగా ఉందని సిరిసిల్ల చేనేత కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.