TELANGANA

లోక్ సభ ఎన్నికల్లో పోటీకి భయపడుతున్న బీఆర్ఎస్ సీనియర్లు.. .

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన బీఆర్ఎస్ ఇప్పుడు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని నిర్ణయించిన క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు. అయితే లోక్సభ నియోజకవర్గాల సమీక్ష తో పాటు, నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 

చాలా జిల్లాలలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది సీనియర్లు వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు లోక్సభ ఎన్నికల ఫలితాలలోను రిపీట్ అవుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది సీనియర్లు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన నాటి నుండి తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేస్తోంది.

 

ఇందులో భాగంగా ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిని పదిలక్షల రూపాయలకు విస్తరించింది. ఇక మిగతా హామీలను కూడా నెరవేర్చడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పైన ప్రజలలో ప్రస్తుతానికి ఎటువంటి వ్యతిరేకత లేదు. దీంతో లోక్సభ ఎన్నికలలో పోటీ చేసినా కాంగ్రెస్ కు ఫలితాలు అనుకూలంగానే వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

 

లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తే అనవసరంగా ఓటమిపాలు అవుతామని భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ట్రెండ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీకి చాలామంది ససేమిరా అంటున్నారు. లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడం డబ్బులు వృధా తప్ప వేరే కాదని భావిస్తున్నారు.

 

ఒకపక్క కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 16 స్థానాలను లోక్సభ ఎన్నికలలో బి ఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 సీట్లలో ఎలా గెలుస్తుంది అన్న చర్చ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లోనే కొనసాగుతోంది.

 

ఇక ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. ఆయన వచ్చిన తర్వాత ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది చూశాక ఆలోచిద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాజిటివ్ వేవ్ ఉన్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడుతున్నారు.