AP

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పై సుప్రీంలో తాజా అప్డేట్..!!..

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో 53 రోజులు రిమాండ్ ఎదుర్కొన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు.

 

సుప్రీంలో విచారణ చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు దేశం విడిచి వెళ్లటంలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో వివరించింది. హైకోర్టు మినీ ట్రయల్‌ నిర్వహించడంతోపాటు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో పూర్తిగా పొరబడిందని పేర్కొంది. తీర్పులో పేర్కొన్న అంశాలన్నీ రికార్డులకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.

ఏపీ ప్రభుత్వం అప్పీల్ స్కిల్ కేసులో చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నందున బెయిల్‌ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు తీర్పులో పేర్కొన్న అంశాలన్నీ రికార్డులకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ పిటీషన్ పైన సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. దీంతో ఫిబ్రవరి 12వ తేదీకి కేసును వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ లో 17ఏ అంశం పైన ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రిమాండ్, ఎప్ఐఆర్ గురించి ఎక్కడా న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సీజేఐకు కేసు రిఫర్ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

 

ఫిబ్రవరి 12కి వాయిదా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణ పైన ప్రత్యేకంగా బెంచ్ కు రిఫర్ చేయాల్సి ఉంటుంది. బెంచ్ ఖరారు అయిన తరువాత ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించటంతో పాటుగా 17ఏ పైన వాదనలు వినే అవకాశం ఉంది. అయిదుగురు సభ్యుల ధర్మాసనం కు ఈ కేసు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడ విచారణ తరువాత చంద్రబాబు 17ఏ అంశం పైన సుప్రీం లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందది. దీంతో, ప్రస్తుతం స్కిల్ కేసులో బెయిల్ పైన ఉన్న చంద్రబాబు పై ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పైన ఫిబ్రవరి 12న విచారణ జరగనుంది.